: వైకాపా ప్లీనరీకి వర్షం ఎఫెక్ట్... పనులన్నీ మొదటికి!
వైకాపా ప్లీనరీ నిమిత్తం అమరావతిలోని ఆచార్య నాగార్జున వర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాట్లు పూర్తికాగా, పెనుగాలులతో కూడిన భారీ వర్షాలకు పనులన్నీ తిరిగి మొదటికి వచ్చాయి. సమావేశ మందిరంతో పాటు భోజనశాల, వంటశాల ప్రాంగణాల్లో వర్షపు నీరు చేరగా, గాలులకు పైకప్పుగా వేసిన రేకులు ఎగిరిపోయాయి. దీంతో వైకాపా నేతలు యుద్ధ ప్రాతిపదికన తిరిగి పనులు మొదలు పెట్టాల్సి వచ్చింది. నేటి సాయంత్రం లేదా రేపటి లోగా పనులన్నీ పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో తమిళనాడుకు చెందిన నిపుణులతో గత రాత్రంతా పని చేయించారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు సాగుతుండగా, పలువురు పార్టీ నేతలు చెవిరెడ్డికి సాయపడుతున్నారు. సమావేశం లోపలి కప్పుకు పార్టీ జెండాలను అలంకరించారు. ప్రధాన వేదిక వద్ద మ్యాట్లు పరిచే పనులు సాగుతున్నాయి. వర్షపు నీటిని తోడించిన వైకాపా నేతలు, రోలర్లతో ప్రాంగణాన్ని చదును చేయిస్తున్నారు. ఆటంకాలు ఎదురైనా అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తామని, 600 అడుగుల దూరంలో కూర్చున్న వారికి కూడా కనిపించేలా భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నామని వైకాపా నేతలు ప్రకటించారు.