: అందరికీ ఉద్యోగాలు కావాలంటే ఎలా?: వెంకయ్యనాయుడు
ఏపీలో నిరుద్యోగ సమస్యపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ ఉద్యోగాలు కావాలంటే ఎలా? అని ప్రశ్నించిన ఆయన, స్వయం ఉపాధిని చూసుకోవడమే ఉత్తమమని అన్నారు. ఈ ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆత్కూరులో పర్యటించిన ఆయన, స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న 200 మందికి ధ్రువ పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, అందరికీ ఉద్యోగ కల్పన ఏ ప్రభుత్వం వల్ల కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. యువత ముందు చూపుతో, ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా మరో నలుగురికి ఉపాధిని చూపించినవారవుతారని సలహా ఇచ్చారు. స్వయం ఉపాధి దిశగా యువతను నడిపించేందుకు స్వర్ణ భారత్ ట్రస్ట్ కృషి చేస్తుందని తెలిపారు. కేంద్రం సైతం నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తోందని గుర్తు చేసిన ఆయన, ట్రస్ట్ గన్నవరం విభాగం ద్వారా ఇప్పటివరకూ 1300 మందికి ఉద్యోగాలు దక్కాయని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలకు తోడ్పాటును అందిస్తే, మరింత మందికి ఉద్యోగాలు దగ్గరవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.