: ఉగ్రవాది బుర్హాన్ వనీని స్మరిస్తూ ర్యాలీనా? దానిని ఆపండి..: బ్రిటన్ పై భారత్ ఆగ్రహం
గతేడాది భారత భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని స్మరిస్తూ ఈనెల 8న బర్మింగ్‌హామ్‌లో నిర్వహించతలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని అడ్డుకోవాల్సిందిగా కోరింది. ఈ మేరకు భారత డిప్యూటీ కమిషనర్ దినేశ్ పట్నాయక్ ‘నోట్ వెర్బల్’ జారీ చేశారు. జూలై 8న బ్రిటన్‌లో జరగనున్నది భారత వ్యతరేక కార్యక్రమమేనని అందులో పేర్కొన్నారు.
భారత్ ఉగ్రవాదిగా గుర్తించిన వ్యక్తి జ్ఞాపకార్థం నిర్వహించే ర్యాలీకి థెరేసా మే ప్రభుత్వం అనుమతిస్తుందని తాము ఊహించలేదని పేర్కొన్నారు. వనీ ఏకే 47 రైఫిల్‌తో కనిపించాడని, భారత్‌ను వనీ ముక్కలు చేయాలనుకున్నాడని అందులో ఆరోపించారు. జూలై 8న ‘బుర్హాన్ వనీ డే’గా గుర్తిస్తూ బర్మింగ్‌హామ్‌లోని కౌన్సిల్ హౌస్ ఎదుట ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.