: ఇజ్రాయెల్ వరకు వెళ్తున్న మీరు పాలస్తీనాను ఎందుకు సందర్శించడం లేదు?: మోదీని ప్రశ్నించిన అసదుద్దీన్
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా పాలస్తీనాను సందర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ప్రణాళిక రూపొందించుకోలేదని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గతంలో భారత్ అధికారులు ఎవరు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినా పాలస్తీనాకు చెందిన, ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాలుగా చెబుతున్న వెస్ట్ బ్యాంక్, గాజాలను సందర్శించేవారని అన్నారు.
మోదీ మాత్రం తన పర్యటనలో ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాలను సందర్శించడం లేదని ఆయన విమర్శించారు. దీంతో ఇజ్రాయెల్ ఆక్రమణ సహేతుకమైనదేనని చెప్పినట్టవుతుందని ఆయన పేర్కొన్నారు. పాలస్తీనా పోరాటానికి మోదీ ప్రభుత్వం మద్దతివ్వడం లేదని ఆయన విమర్శించారు. హిజ్‌బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినట్టే... హఫీజ్ సయీద్ ను ఐక్యరాజ్యసమితి సాయంతో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.