: 'రేప్ చేసిన వాడితో పెళ్లేంటి?' అంటూ రద్దు చేసుకున్న ధీశాలి!


పెళ్లికి ఒక రోజు ముందు తనకు కాబోయే భర్త, అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడని తెలుసుకున్న ఓ యువతి, రేప్ చేసిన వాడితో పెళ్లేంటని, అమ్మాయిల పట్ల గౌరవం చూపని వాడు తనకు వద్దని చెబుతూ పెళ్లిని రద్దు చేసుకుని, అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ ఘటన యూపీలోని బరేలీ ప్రాంతంలో జరిగింది. తన జీవితాన్ని అత్యాచార నిందితుడితో గడపలేనని ఆమె చెప్పగా, తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. బులానియా గ్రామ యువకుడైన భాను ప్రతాప్ (24)కు ఓ యువతితో పెళ్లి నిశ్చయం కాగా, అతనిపై అప్పటికే దేవ్ రానియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఉంది.

అయితే, ఇది తప్పుడు కేసని, తనకే పాపం తెలియదని ప్రతాప్, పెళ్లి కూతురికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, ఆమె వినలేదు. పెళ్లి నిమిత్తం కట్న కానుకలుగా ఇచ్చిన బహుమతులు, డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేయాలని ఆ గ్రామ పంచాయితీ పెద్దలు తీర్పిచ్చారని తెలుస్తోంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లూ పూర్తయిన తరువాత వరుడి తరఫు బంధువుల్లోని ఒకరు ఈ విషయాన్ని వధువుకు చేరవేయగా, వెంటనే విషయాన్ని నలుగురికీ చెప్పి పెళ్లిని రద్దు చేసుకుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదును న్యాయమూర్తి ముందు ఉపసంహరించుకుందని, దీంతో భాను ప్రతాప్ పై ఈ సంవత్సరం జూన్ లో నమోదైన కేసును మూసి వేయాలని నిర్ణయించుకున్నామని బారాదరి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విమలేష్ సింగ్ వెల్లడించడం గమనార్హం. ఈ పెళ్లి రద్దయిన తరువాత తనను కలిసిన మీడియాకు ఆయనీ విషయం చెప్పారు.

  • Loading...

More Telugu News