: రాజశేఖరరెడ్డి అభిమానులు బాధపడుతున్నారు.. ఆయన ఫొటో పెట్టుకునే అర్హత కూడా మీకు లేదు: జగన్ కు రఘువీరా బహిరంగ లేఖ


వైసీపీ అధినేత జగన్ కు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓ ఘాటు బహిరంగ లేఖ రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులంతా మిమ్మల్ని చూసి బాధపడుతున్నారని... వైయస్ ఫొటో పెట్టుకునే అర్హత కూడా మీకు లేదంటూ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ అవసరాల కోసం, మత తత్వానికి మద్దతిస్తున్న బీజేపీకి సపోర్ట్ చేయడం అత్యంత దారుణమని చెప్పారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ కు వైసీపీ మద్దతు పలికిన నేపథ్యంలో రఘువీరా ఈ లేఖ రాశారు.

రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేంత బలం బీజేపీకి లేదని... టీడీపీ, వైసీపీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే, ఆయన గెలిచే అవకాశమే లేదని లేఖలో రఘువీరా పేర్కొన్నారు. కనీసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ ను కూడా చేయకుండానే బీజేపీకి జగన్ మద్దతు పలకడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీని సెక్యులర్ పార్టీగా ప్రజలు నమ్మారని... కానీ, నమ్మి ఓటేసిన ఓటర్లను వైసీపీ మోసగించిందని ఆయన పేర్కొన్నారు.

జగన్ తీసుకున్న నిర్ణయం దళితులు, మైనార్టీలు, ఇతర సెక్యులర్ శక్తులను అవమానించడమే అని చెప్పారు. మోదీ హయాంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని... దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ చెబుతున్న లౌకికవాదమంతా అబద్ధమేనని విమర్శించారు. వైసీపీకి సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం పట్ల నమ్మకం ఉంటే... కాంగ్రెస్ బలపరిచిన మీరాకుమార్ కు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని డిమాండ్ చేశారు. రఘువీరా లేఖపై వైసీపీ ఇంకా స్పందించాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News