: ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన ప్రభుత్వం!
జీఎస్టీ అమలుతో ఏ వస్తువుల ధరలు పెరిగాయో, ఏ వస్తువుల ధరలు తగ్గాయో తెలియక వినియోగదారులు తీవ్ర గందరగోళంలో ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. ఏపీలో కొత్త మద్యం పాలసీలోకి అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ)ని అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో మద్యం బాటిల్ పై 3 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఒక్కసారిగా పెరిగింది.
గతంలో కేవలం మద్యం డ్యూటీ మాత్రమే ఉండగా, లైసెన్స్ ఫీజులు తగ్గించిన నేపథ్యంలో కొత్తగా ఏఈడీని అమలులోకి తీసుకొస్తున్నట్టు ఏపీ ప్రకటించింది. దీనిని 36%గా ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఒక్క క్వార్టర్ చీప్ లిక్కర్ బాటిల్ పై 3 రూపాయలు పెంచగా, మధ్య రకం మద్యంపై 7 రూపాయలు, ఖరీదైన మద్యం 10 రూపాయల వరకు పెరిగింది. ఫుల్ బాటిల్ చీప్ లిక్కర్ పై 12 రూపాయలు, మీడియం మద్యంపై 28 రూపాయలు, ఖరీదైన మద్యంపై ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు పెరిగినట్టు తెలుస్తోంది.