: సినీ పరిశ్రమకు డ్రగ్ ముఠాతో లింకులు... కలకలం రేపుతున్న పోలీసుల ప్రకటన!
సినీ పరిశ్రమతో డ్రగ్స్ ముఠా లింకులను పోలీసులు మరోసారి పోలీసులు బట్టబయలు చేయడం కలకలం రేపుతోంది. అత్యంత ఖరీదైన మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాదు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ, పట్టుబడిన డ్రగ్ ముఠా సభ్యులకు సినీ పరిశ్రమకు చెందిన కొందరితో సంబంధం ఉందని అన్నారు. డ్రగ్ రాకెట్ తో సినీ పరిశ్రమ సంబంధాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
పట్టుబడిన ముగ్గురూ ఉన్నత విద్యావంతులని, ప్రఖ్యాత ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేస్తూ, లక్షల్లో జీతాలు పొందుతోన్న వారేనని అన్నారు. ముగ్గురూ సరఫరా చేసే డ్రగ్స్ ఒక్కో చుక్క కొన్ని వేల రూపాయల ఖరీదు చేస్తుందని ఆయన అన్నారు. వారి నుంచి 700 యూనిట్ల ఎల్‌ఎస్‌డీ, 34 గ్రాముల ఎండీఎంఏ ను స్వాధీనం చేసుకుని, సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఈ ముఠాతో ఎంతమందికి సంబంధాలున్నాయి? ఎంతమందికి సరఫరా చేశారు? ఎక్కడెక్కడ అమ్మారు? అన్న విషయాలపై వివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.