: గోదావరికి జలకళ... తెరచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు
గడచిన మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ జలకళను సంతరించుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. సీడబ్ల్యూసీ అధికారుల పర్యవేక్షణలో మహారాష్ట్ర, తెలంగాణ ఇంజనీర్ల సమక్షంలో 14 గేట్లను ఎత్తారు. 0.1 టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నామని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. ఈ నీరు నేటి మధ్యాహ్నానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రానుంది. ఇక జయశంకర్ జిల్లా మంగపేట వద్ద పుష్కరఘాట్ పైకి గోదావరి నీరు చేరింది. మరోవైపు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకూ వరదనీరు వస్తోంది. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోందని అధికారులు వ్యాఖ్యానించారు. ఆల్మట్టికి 27,430 క్యూసెక్కులు, జూరాలకు 1,140 క్యూసెక్కులు, తుంగభద్రకు 14,573 క్యూసెక్కులు, శ్రీశైలంకు 713 క్యూసెక్కుల నీరు వస్తోంది.