: జీఎస్టీ ఓక చారిత్రక అవసరం.. ఒక నూతన అధ్యాయం!: మోదీ
ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛార్టెడ్ అకౌంటెంట్లను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఆర్థిక రంగం బలంగా ఉండేందుకు సీఏలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే అవకాశం సీఏలకు ఉందని అన్నారు. వైద్యులు మనుషులకొచ్చే వ్యాధులను నయం చేస్తారని, ఛార్టెడ్ అకౌంటెంట్లు ఆర్థికపరమైన జబ్బులను నయం చేయాలని అన్నారు. ఈ రోజు నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ చారిత్రక అవసరమని అన్నారు. ఆర్థికపరంగా జరుగుతున్న తప్పులను గుర్తించి అది తప్పు అని చెప్పే ధైర్యం సీఏలకే ఉందని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత ఛార్టెడ్ అకౌంటెంట్లకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం దేశాన్ని దోచుకున్న వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తోందని అన్నారు. ఏ దేశంలో ఆర్థికపరమైన దోపిడీ జరుగుతోందో ఆ దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోలేదని అన్నారు. అటువంటి దోపిడీని తాము అరికడుతున్నామని అన్నారు. పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయంతో తమ ప్రభుత్వం ఆర్థికదోపిడీ చేసే వారి గుండెల్లో భయం పుట్టించిందని అన్నారు. ఈ రోజు అమలులోకి వచ్చిన జీఎస్టీ చారిత్రక అవసరమని మోదీ అన్నారు. జీఎస్టీ అమలు దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయమని చెప్పారు.