: పెంచకుండా పంచితే నీకు మిగిలేది పంచె మాత్రమే: వెంకయ్య నాయుడు చురకలు
‘ఆస్తిని, సంపదను పెంచకుండా పంచితే చివరికి నీకు మిగిలేది పంచె మాత్రమే’నని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్య నాయుడు చురకలంటించారు. ఈ రోజు హైదరాబాద్, గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి ఫలాలను అందరికీ పంచాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తీసుకొచ్చిందని, దీనిపై విమర్శలు వద్దని వ్యాఖ్యానించారు.
దేశంలో ఆర్థికంగా ఎదగడానికి అందరికీ అవకాశాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఈ విధానం విజయవంతంగా అమలులో ఉందని అన్నారు. ఒక దేశం ఒకే పన్ను జీఎస్టీ విధానం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పద్ధతి ద్వారా సాధారణ ప్రజలకు లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు. జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయమని అన్నారు. దేశంలోని అసమానతలను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సామాన్యులు వాడే 80 రకాల వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే ట్యాక్స్ వేసినట్లు వివరించారు.