: 3 రోజుల పాటు పలు వ్యాపార సంస్థలకు తాళాలు!
జీఎస్టీ ప్రభావంతో మారిన ట్యాక్స్ తో మూడు రోజులపాటు తమ సంస్థలను తెరవబోమని చాలా మంది వ్యాపారులు ప్రకటిస్తున్నారు. కొత్త విధానం వల్ల తమ సిస్టమ్స్ అప్‌గ్రేడ్ అవడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. మరి కొంతమంది వ్యాపారులు వారం రోజులు తమ వ్యాపారాన్ని స్తంభింపజేయనున్నట్లు తెలిపారు. వారిలో మొబైల్ ఫోన్ సేవా కేంద్రాలు, ఫార్మా కంపెనీలు, బిస్కెట్ల తయారీదారులు, ఆటోమొబైల్ షోరూం వంటి ఇతర సంస్థల వ్యాపారులు ఉన్నారు. తమ అంతర్గత సిస్టమ్స్ స్థిరత్వానికి వచ్చాకే మళ్లీ వ్యాపారం కొనసాగించే వీలు ఉంటుందని చెప్పారు.
ఇప్పటికే పలు సర్వీసు సెంటర్లను మూసివేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని టాప్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల సర్వీసు సెంటర్లు మళ్లీ మంగళవారం నుంచి తమ సేవలను ప్రారంభిస్తామని ప్రకటిస్తున్నాయి. ఈ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో డాబర్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. కంపెనీ వ్యవహారాలు జీఎస్టీకి అనుగుణంగా మారడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని ఆ సంస్థ తెలిపింది. జీఎస్టీకి భిన్నమైన ఇన్‌వాయిసింగ్ అనే సిస్టమ్ అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.