: సింహాల గుంపు మధ్యలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..!


సింహాల గుంపు మధ్యలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం రాత్రి గుజరాత్‌లోని అమెరేలి జిల్లా జఫ్రాబాద్ తాలుకా లన్సాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిండు గర్భిణి అయిన మహిళకు బుధవారం రాత్రి అకస్మాత్తుగా నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అక్కడి నుంచి సమీపంలోని ఆస్పత్రికి బయలుదేరారు. అయితే గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించే సరికి రోడ్డుపై సింహాల గుంపు కనిపించింది. 11-12 సింహాలు రోడ్డుకు అడ్డంగా నిల్చున్నాయి. దీంతో అంబులెన్స్‌ను నిలిపివేశారు. పులులు అక్కడి నుంచి వెళ్లాక బయలుదేరాలని నిర్ణయించారు. అయితే అవి ఎంతసేపటికీ కదల్లేదని జిల్లా 108 అంబులెన్స్ సేవల చీఫ్ చేతన్ గధియా తెలిపారు.

అదే సమయంలో మహిళకు రక్త స్రావం మొదలైంది. పులులు రోడ్డుపై నుంచి కదిలే సూచనలు కనిపించకపోవడంతో అంబులెన్స్‌లోనే మహిళకు ప్రసవం చేయాలని అంబులెన్స్ సిబ్బంది నిర్ణయించారు. ఆ వెంటనే వారు ఫిజిషియన్‌తో ఫోన్లో మాట్లాడి ఆయన సూచనల మేరకు డెలివరీ చేశారు. ఇందుకు 25 నిమిషాలు పట్టింది. కాగా, అంబులెన్స్‌ను గమనించిన సింహాలు దాని చుట్టూ చాలాసేపు చక్కర్లు కొట్టినట్టు గధియా తెలిపారు. అనంతరం అంబులెన్స్ డ్రైవర్ నెమ్మదిగా వాహనాన్ని ముందుకు కదిలించాడు. ముందుకు వస్తున్న వాహనాన్ని చూసి సింహాలు కూడా నెమ్మదిగా రోడ్డు పై నుంచి కదిలాయి. దీంతో మహిళ, ఆమె శిశువును జఫ్రాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News