: అంత అభిమానం ఉంటే వైకాపాలో చేరొచ్చుగా!: ఉండవల్లికి బుద్ధా వెంకన్న సలహా
వచ్చే ఎన్నికల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్ సీఎం అవుతారంటూ ఉండవల్లి జోస్యం చెబుతుండటంపై తెలుగుదేశం నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉండవల్లికి జగన్ పై అంత ప్రేమ, అభిమానం ఉంటే, వెళ్లి వైకాపాలో చేరవచ్చని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కక్ష సాధింపు ధోరణిలో విమర్శలు చేస్తున్నాయని, ఇక ఉండవల్లి వంటి ఏ పార్టీకీ చెందని నేతలు తమ భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం వంత పాడుతున్నారని ఆరోపించారు.
ప్రజలు అసహ్యించుకునేలా విపక్షాల తీరు ఉందని దుయ్యబట్టిన ఆయన, దాదాపు రెండు దశాబ్దాల తరువాత, జూన్ లోనే పంట పొలాలకు నీరు విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. వైఎస్ జీవించి వుంటే, 2011లోనే పోలవరం పూర్తయి ఉండేదని చెప్పడం ఉండవల్లి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. అమరావతి నిర్మాణానికి రుణం అవసరం లేదని వైకాపా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయడం తీవ్ర గర్హనీయమని విమర్శించారు.