: రజనీకాంత్, పవన్ కల్యాణ్ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాం: ప్రజా గాయకుడు గద్దర్
దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) వ్యవస్థాపకుడు, ప్రజా గాయకుడు గద్దర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ తో కలిసి పని చేయాలని భావిస్తున్నామని, తమ ప్రతినిధులు వెళ్లి తమ విధానాలను వివరించారని, వారి అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
దక్షిణాది ఆత్మగౌరవ జెండా రెపరెపలు చూడాలనే ఉద్దేశంతోనే రజనీ, పవన్ ను 'సికా'లోకి ఆహ్వానించామని చెప్పారు. 200 పార్లమెంట్ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని గద్దర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘాట్ ఏర్పాటు చేయకపోవడం వివక్ష చూపడమేనని గద్దర్ అన్నారు.