: గో భక్తి పేరిట హత్యలు చేస్తుంటే తీవ్ర పరిణామాలు: హెచ్చరించిన మోదీ
గోవుల రక్షకులమని చెప్పుకుంటే హత్యలు చేస్తూ దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. "గో భక్తి పేరిట హత్యలు చేస్తుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుంది. ఈ తరహా చర్యలను మహాత్మా గాంధీ కూడా అంగీకరించరు. మనది అహింసా దేశం. గాంధీ నడయాడిన దేశం. దాన్నే మరచిపోతే ఎలా?" అని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దేశాల పర్యటనను ముగించుకుని నిన్న ఢిల్లీ చేరుకున్న ఆయన, నేడు తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు వచ్చి అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమాన్ని ప్రారంభించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా, శత వార్షిక ఉత్సవాలను ప్రారంభించిన ఆయన, భారతావనిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే శక్తి ఎవరికీ లేదని అన్నారు. హింసతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ నూలు ఒడికిన రాట్నం ముందు మోదీ కాసేపు కూర్చుని దూది నుంచి దారాన్ని తీశారు.