: ఇక్కడ కేసు వచ్చిందని విజయవాడ అన్నాడు... అక్కడ చేస్తున్నదేమిటి?: చంద్రబాబుపై నాదెండ్ల విసుర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు స్పందిస్తూ, చంద్రబాబు వైఖరి తనకు ఎంతమాత్రమూ నచ్చట్లేదని అన్నారు. "ఇక్కడ కేసు వచ్చేటప్పటికి విజయవాడ అన్నాడు. విజయవాడలో సరిగ్గా లేదు. మళ్లీ వెనక్కు వెళ్లాల్సిందేనని చెబుతున్నాడు. ఇది ఏమిటిది? రాష్ట్రం ఏమై పోతోంది? డబ్బంతా ఏమైపోతోంది? ఎవరూ అడిగేవారు లేరు" అన్నారు.
తాను కమ్మ, అతను కమ్మ అని చెప్పటం లేదని తెలిపారు. రెండెకరాల పొలంలో కూలిపని చేసుకుంటూ అలా అలా పైకి వచ్చిన చంద్రబాబు, తాను మంత్రి అయిన సమయంలో తన దగ్గరే ఉండేవాడని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారని, కానీ కొంత కాలం వేచి చూస్తే, అసలు విషయం తెలుస్తుందని నాదెండ్ల అన్నారు. అతను ఎన్టీఆర్ ఇంట్లో ఉన్నాడని, అందువల్లే ఎన్టీఆర్ గోచీని వెనకనుంచి సులువుగా లాగారని ఆరోపించారు.
రాజకీయాలు నేర్చుకోవాలంటే కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి నేర్చుకోవాలని, జలగం వెంగళరావు ఎమర్జెన్సీ సమయంలో విజయవంతమైన నేతగా పేరు తెచ్చుకున్నారని, పీవీ నరసింహరావు గురించి లోకానికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని, భవనం వెంకట్రామిరెడ్డి ఓ ముఖ్యమంత్రే కాదని, అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదని, అంజయ్యతో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించింది తానేనని, నేదురుమల్లి జనార్దనరెడ్డి కూడా భవనం కేటగిరేనని, చిన్న దొంగ, పెద్ద దొంగలని తెలిపారు. రాష్ట్రం విడిపోవడం ప్రజల దురదృష్టమని, మంచి నేతలను వదిలి దోపిడీ దొంగలను ప్రజలు ఎన్నుకున్నారని తన మనసులోని అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు.