: జూలై 4న మోదీ, మోషేను కలుస్తారు: భారతలో ఇజ్రాయిల్ రాయబారి
ప్రధాని నరేంద్ర మోదీ తన ఇజ్రాయిల్ టూర్ లో ముంబై మారణహోమ బాధితుడు మోషేను కలవనున్నారు. 2008 నవంబర్ 26న లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు ముంబైపై విరుచుకుపడి మారణ హోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నారిమన్ హౌస్ పై దాడి చేసిన కసబ్ సహచరులు, మోషే తల్లిదండ్రులు రివిక, తండ్రి గావ్ రియల్ హోల్ట్జ్ బర్గ్ ను హతమార్చారు. అక్కడే ఉన్న రెండేళ్ల మోషేను వాళ్లింట్లో ఆయాగా పనిచేసే ఇండియాకు చెందిన శాండ్రా శామ్యూల్ అనే మహిళ రక్షించింది. ఆ దారుణం తరువాత మోషే తాత, నానమ్మ ఇండియాకు వచ్చి, మనవడితో పాటు అయాను కూడా ఇజ్రాయిల్ తీసుకువెళ్లిపోయారు. పదకొండేళ్ల మోషే ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాడు.
జూలై 4న ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ పర్యటన ప్రారంభం కానుంది. ఇజ్రాయిల్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో మోదీ చిన్నారి మోషేను కలవనున్నారు. ఈమేరకు భారత్ లో ఇజ్రాయిల్ రాయబారి డేనియల్ కార్మన్ ప్రకటన చేశారు. ఇది భావోద్వేగ కలయిక అని చెప్పారు. భారత్-ఇజ్రాయిల్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.