: ఆఫర్ల వర్షంలో తడిసిముద్దవుతున్న వినియోగదారులు.. బిగ్‌బజార్ నుంచి అమెజాన్ వరకు ఆఫర్లే ఆఫర్లు!
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రభావంతో వినియోగదారులు ఆఫర్ల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. తమ వద్ద ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న రిటైలర్లు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బిగ్‌బజార్ నుంచి అమెజాన్ వరకు లెక్కలేనన్ని ఆఫర్లు ప్రకటిస్తూ తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఫీచర్ గ్రూప్‌కు చెందిన బిగ్‌బజార్ 30తేదీ అర్ధరాత్రి నుంచి 22 శాతం తగ్గింపుతో విక్రయాలు ప్రారంభించనుండగా బుధవారం రాత్రి నుంచి డిస్కౌంట్ సేల్ ప్రారంభించినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అమెజాన్ ఇప్పటికే 40-50 శాతం రాయితీతో ప్రి-జీఎస్‌టీ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల విలువైన టీవీని కేవలం రూ.60 వేలకే అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు వెల్లడించేందుకు అమెజాన్ నిరాకరించింది.
షాపింగ్‌కు ఇది అనువైన సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జీఎస్‌టీ కారణంగా మార్జిన్ తగ్గడం, తద్వారా లాభాలు తగ్గే అవకాశం ఉండడంతో మేల్కొన్న రిటైలర్లు తమ వద్ద ఉన్న స్టాక్‌ను ఇలా ఆఫర్ల పేరుతో క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇన్‌ఫినిటీ రిటైలర్ సంస్థ చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ రితేష్ ఘోషల్ తెలిపారు. నైక్, క్లార్క్స్, బెంటెన్, ఆసిక్స్ తదితర 300 స్టోర్లు కలిగిన ఎస్ఎస్ఐపీల్ కూడా ‘ఎండ్ ఆఫ్ సీజన్ సేల్’ పేరుతో విక్రయాలు ప్రారంభించినట్టు ఆ సంస్థ ఎండీ రిషబ్ సోనీ తెలిపారు. మొత్తంగా జీఎస్‌టీ పుణ్యమా అని వినియోగదారులపై ఆఫర్ల జడివాన కురుస్తోంది.