: ‘డీజే’కి వస్తోన్న కలెక్షన్లను చూసి ఓర్వలేకపోతున్నారు: దిల్ రాజు
‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమాను పలువురు ఆన్‌లైన్‌లో ఉంచడంతో ఈ రోజు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీశ్ శంకర్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ... డీజేకి వస్తోన్న కలెక్షన్లను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని, అందుకే తమను దెబ్బతీయాలని ఆన్‌లైన్‌లో ఈ సినిమాను పోస్ట్ చేస్తున్నారని అన్నారు. ఫేస్‌బుక్‌తో పాటు యూ ట్యూబ్‌లో ఈ సినిమా హల్‌చల్ చేస్తోన్న అంశంపై తాము ఈ రోజు పోలీసులకి ఫిర్యాదు చేశామని వివరించారు.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ... రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో డీజే సినిమాను అత్యధికంగా షేర్ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లు భారతీయ సినిమా చరిత్రలోనే టాప్-5లో ఉండనున్నాయని, త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అయితే, సోషల్ మీడియాలో ఇలా తమ సినిమాను పెడితే రికార్డులను చేరుకోలేమని అన్నారు.