: జీఎస్‌టీ ఎఫెక్ట్.. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించిన కంపెనీలు!
జీఎస్‌టీ ప్రభావం అప్పుడే మొదలైంది. మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల వెల్లువను నిలువరించేందుకు మొబైల్ మేకర్లు అప్పుడే ఉత్పత్తిని తగ్గించేశారు. ఈ నెలలో ఫోన్ల ఉత్పత్తిని 10-15 శాతం తగ్గించినట్టు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం.. నోకియా, మైక్రోమ్యాక్స్, పానసోనిక్ కంపెనీలు ఇప్పటికే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశాయి. చిరు వ్యాపారులు, వ్యాట్ పరిధిలోకి రాని వ్యాపారులు జీఎస్‌టీలోకి వచ్చేందుకు అంతంగా ఆసక్తి చూపడం లేదు.
జీఎస్‌టీ విషయంలో ప్రతి ఒక్కరిలోనూ తెలియని భయం ఆవరించి ఉందని డిక్సన్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ వచ్చాని పేర్కొన్నారు. ఇంటెక్స్, పానసోనిక్, జియోనీ ఫోన్లను తయారు చేసేది ఈ కంపెనీయే. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మధ్యతరహా కంపెనీల్లో జీఎస్‌టీ భయం ఎక్కువగా ఉందని సునీల్ పేర్కొన్నారు. ఫలితంగా ఉత్పత్తి 15 శాతం వరకు తగ్గిపోయిందన్నారు. మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ జీఎస్‌టీ భయంతో 60 శాతం మంది డీలర్లు, చిన్న, మధ్య తరగతి రిటైలర్లు వ్యాట్ నంబర్లు లేకుండానే మొబైళ్లను విక్రయిస్తున్నట్టు తెలిపారు. వీరిలో చాలామందికి వ్యవస్థ గురించి తెలియదని, మరికొందరు వ్యవస్థలో భాగస్వామం కావడానికి ఇష్టపడడం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా, మొబైల్ ఫోన్లపై ప్రభుత్వం 12 శాతం పన్ను విధించడంతో జూలై 1 తర్వాత ఫోన్ల ధరలు 4 నుంచి 5 శాతం పెరిగే అవకాశం ఉంది.