: ముంబైలో వరుణ బీభత్సం... ఆగిన రైళ్లు, జనజీవనం అస్తవ్యస్తం
గత రాత్రంతా కురిసిన భారీ వర్షానికి నేడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనజీవనం అతలాకుతలమైంది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరగా, రైలు పట్టాలపై కూడా నీరు రావడంతో, ఈ ఉదయం ఆఫీసులకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. దాదర్, సియాన్, మాతుంగ, అంధేరి ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హార్బర్, సెంట్రల్ లైన్ లో ప్రయాణించాల్సిన పలు రైళ్లు నిలిచిపోగా, మరికొన్ని 20 నిమిషాల వరకూ ఆలస్యంగా నడుస్తున్నాయి.
వర్షంతో ఇబ్బందులు పడుతున్న 22 ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యలు చేపట్టామని, ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని మునిసిపల్ అధికారులు పేర్కొన్నారు. పెనుగాలులతో సముద్రంపై నుంచి 4.81 మీటర్ల ఎత్తయిన అలలు తీరాన్ని తాకాయని, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడానికి ఇది కూడా కారణమని బీఎంసీ డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ సుధీర్ నాయక్ తెలిపారు. వెంటనే డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమును పంపామని, ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కు ప్రత్యామ్నాయాలను చూపామని అన్నారు.