: వీడియో గేమ్‌లతో ఏకాగ్రత మెరుగు!
వీడియో గేమ్‌లు ఆడటం వల్ల మానవ మెదడు బాగా ప్రభావితమవుతోందని ఓ పరిశోధనలో తేలింది. వాటిలో మంచి పరిణామాల విషయానికొస్తే ఏకాగ్రత, చురుకుదనం పెరగడం, భిన్నంగా ఆలోచించే స్వభావం అలవడటం జరుగుతుంది. ఇక చెడు పరిణామాలను తీసుకుంటే, వీడియో గేమ్‌లు ఒక వ్యసనంగా మారిపోయే అవకాశముంది. మారుతున్న టెక్నాలజీ, చౌకగా అందుబాటులోకి వస్తున్న కంప్యూటర్లు, టాబ్లెట్లు, కన్సోల్‌ల వల్ల వీడియో గేమ్‌లు ఆడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
చిన్న పిల్లలే కాకుండా పెద్ద వాళ్లు కూడా సమయం దొరికినపుడు వీడియోగేమ్‌లు ఆడేస్తున్నారు. 2016లో వీడియో గేమ్‌లు ఆడేవారి సగటు వయసు 35కి పెరిగిందని సర్వే చెబుతోంది. ఈ విషయంపై స్పెయిన్‌లోని ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ కాటాలీనా పరిశోధకులు చేసిన అధ్యయనంలో వీడియో గేమ్‌ల వల్ల కలిగే సత్ఫలితాల గురించి తెలిసింది. గేమ్‌లు ఆడే సమయంలో ఒక్కో లెవల్‌కి అనుగుణంగా మెదడులోని ఒక్కో భాగం ప్రభావితమవుతోందని, అందుకే ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతున్నాయని శాస్త్రవేత్త మార్క్ పాలస్ వివరించారు.