: ఇక ఎన్నడూ రజనీకాంత్ ను నరేంద్ర మోదీ కలవరు: సుబ్రహ్మణ్య స్వామి
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులంతా గంపెడాశతో ఎదురు చూస్తున్న వేళ, వివాదాస్పద వ్యాఖ్యల నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ ఆర్థిక నేరగాడని ఆరోపించిన స్వామి, రజనీ నేరాలకు సంబంధించి తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలోని శంకరమఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నుంచి అవార్డును అందుకున్నారు. ఆపై సుబ్రహ్మణ్య స్వామి ప్రసంగిస్తూ, రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవని, ఇకమీదట ప్రధాని నరేంద్ర మోదీ, రజనీని కలవబోరని అన్నారు. ఇటీవలి కాలంలో రజనీ రాజకీయాల్లోకి రానున్నారన్న వార్తలు బయటకు వచ్చిన తరువాత, ఆయన స్థానికుడు కాదని, రాజకీయాల్లోకి వచ్చి రాణించలేరని సుబ్రహ్మణ్య స్వామి పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.