: శబరిమలలో స్వర్ణ ధ్వజస్తంభ ప్రతిష్ఠ... ఆ వెంటనే అపచారం, ఐదుగురు విజయవాడ వాసుల అరెస్ట్
అయ్యప్ప కొలువైన శబరిమలలో పాడైపోయిన ధ్వజస్తంభం స్థానంలో సరికొత్త స్వర్ణ ధ్వజస్తంభ ప్రతిష్ఠ అత్యంత వైభవోపేతంగా జరుగగా, ఆ వెంటనే అపచారం జరగడం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన తరువాత, పాదరసాన్ని కొందరు దుండగులు దానిపై పోశారు. దీంతో స్తంభం కింది భాగంలో చతురస్రాకారంలో ఉండే ‘పంచవర్గాతర’ దెబ్బతిని దానిపై బొబ్బలు ఏర్పడ్డాయి. బంగారు వర్ణం పోయి తెలుపు రంగు వచ్చింది.
ఆపై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు, విజయవాడకు చెందిన ఐదుగురు నిందితులను పంబ వద్ద అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఫీనిక్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ చుక్కపల్లి సురేష్ బంగారం తాపడం కోసం పదిన్నర కిలోల బంగారాన్ని అందించగా, ఆయనతో ఉన్న పాత కక్షలతోనే నిందితులు ఈ పని చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింతగా విచారిస్తున్నామని తెలిపారు.