: రిజర్వ్ బ్యాంకుపై మండిపడిన తెలంగాణ మంత్రి ఈటల.. రూ.2వేల నోట్లు తప్ప చిన్న నోట్లు ఇవ్వడం లేదని ఆరోపణ
భారతీయ రిజర్వ్ బ్యాంకుపై తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ఇప్పటి వరకు తెలంగాణకు సరఫరా చేసిన నోట్లలో 95 శాతం రూ.2 వేల నోట్లేనని తెలిపారు. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు ఆర్బీఐ రూ.53 వేల కోట్లను సరఫరా చేసిందని, అందులో 95 శాతం రూ.2 వేల నోట్లేనని తెలిపారు. ఫలితంగా చిన్న నోట్లు చలామణిలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూల్లో లేకుండా ఉండడాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. ఏటీఎంలలో డబ్బులు లేక బ్యాంకులకు వెళ్తుంటే వారు పెద్దనోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. నోట్ల కొరత వల్ల వారికి మంజూరైన రుణాలను కూడా డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.