: మాజీ ఎమ్మెల్యేకు రూ. 25 లక్షలిచ్చి మాట నిలుపుకున్న కేసీఆర్!
పూట గడవని దయనీయ స్థితిలో ఉన్న కొండపాక మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డికి ఆర్థిక సహాయం చేస్తానని తానిచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఐదు రోజుల క్రితం కొండపాకలో కురుమలకు గొర్రెలను పంపిణీ చేసిన కార్యక్రమం జరుగగా, అక్కడికి వచ్చిన రామచంద్రారెడ్డి, తన అనారోగ్యం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి కేసీఆర్ కు తెలిపారు. ఆయన స్థితి చూసి చలించిపోయి వెంటనే స్పందించిన ఆయన, ఇంటి స్థలాన్ని వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆపై ఆర్థిక సాయం కూడా చేస్తానని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని కూడా అన్నారు. ఆయనిచ్చిన హామీ మేరకు, మంత్రి హరీశ్ రావు కొండపాకకు వెళ్లి, దొమ్మాటికి రూ. 25 లక్షల సాయాన్ని, డబుల్ బెడ్ రూం ఇల్లును అందించారు.