: మద్యంపై వచ్చే ఆదాయం కోసం 'హైవే' హోదాను వదులుకున్న తెలంగాణ ప్రభుత్వం!
జాతీయ రహదారుల పక్కన వైన్ షాపులు ఉండరాదనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంపై వచ్చే ఆదాయం కోసం జాతీయ రహదారులనే వదులుకుంది. మద్యం షాపులను కొనసాగించే క్రమంలో, హైదరాబాద్ గుండా వెళుతున్న మూడు జాతీయ రహదారులను టీఆర్ఎస్ ప్రభుత్వం డీనోటిఫై చేసింది. మొత్తం మీద 55 కిలోమీటర్ల నేషనల్ హైవేను డీనోటిఫై చేశారు. తెలంగాణ ప్రభుత్వ కోరిక మేరకు ఈ హైవేను డీనోటిఫై చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. జాతీయ రహదారుల లిస్ట్ నుంచి తొలగించింది.
ఇందులో ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీ వరకు ఉన్న 14 కిలోమీటర్ల రోడ్డు, అసెంబ్లీ నుంచి మియాపూర్ వరకు ఉన్న 19 కిలోమీటర్ల రోడ్డు, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న 22 కిలోమీటర్ల రోడ్డును డీనోటిఫై చేశారు. దీంతోపాటు హయత్ నగర్ నుంచి పటాన్ చెరు వరకు, ఉప్పల్ నుంచి శంషాబాద్ వరకు ఉన్న రోడ్డును డీనోటిఫై చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం డీనోటిఫై చేసిన మార్గాల్లో 5 ఫైవ్ స్టార్ హోటళ్లు, 3 ప్రముఖ క్లబ్ లు, వందకు పైగా వైన్ షాపులు, బార్లు ఉన్నాయి. మరోవైపు, జాతీయ రహదారులను డీనోటిఫై చేయడంతో... కేంద్రం జాతీయ రహదారులపై పలు నిర్మాణాల కోసం కేటాయించిన రూ. 335 కోట్ల నిధులు వెనక్కి వెళ్లనున్నాయి.