: విఫలమైన ప్రయత్నం...మరింతలోతుకు జారిపోయిన చిన్నారి...పెరిగిన ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనాను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారిని రోబోటిక్ హ్యాండ్ ద్వారా బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు వరుసగా విఫలం కావడంతో...ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు అగ్నిమాపక, సీఐఎస్ఎఫ్, రెవెన్యూ యంత్రాంగం సహకారంతో బోరులో ఉన్న మోటారును జాగ్రత్తగా తీయడం ద్వారా పాపను బయటకు లాగవచ్చని భావించారు.
ఇది కాస్త రిస్క్ అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో పాపను అలా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో విఫలమయ్యారు. దీంతో పాప మరింత లోతుకు జారిపోయింది. ఈ విషయం తెలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జేసీబీతో సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. రాతి భూమి కావడంతో పని ఆలస్యమవుతోంది. దీంతో అంతా పాప క్షేమంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.