: వైకాపా నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్
ఉరవకొండ సాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, అనంతపురంలో నిరసన చేపట్టిన వైకాపా ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, తన అనుచరులు, పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలతో కలసి అనంతపురం ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించి, ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి పథకం ప్రారంభంపై స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ నిరసన కొనసాగుతుందని తెలిపారు.
వీరి ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ఆపై ఉద్రిక్త వాతావరణం తలెత్తే పరిస్థితి ఏర్పడటంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.