: "వందమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్‌లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం"... 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ డైలాగులివి!
రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ ఇప్పుడు అదరగొడుతోంది. ఈ చిత్రంలో ఉన్న డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉండటంతో గంటల వ్యవధిలో లక్షల వ్యూస్ వచ్చాయి. "వాడి జీవిత చరిత్ర టీవీలో చూపించనీకి వాడేమైనా అల్లూరి సీతారామరాజా? సుభాష్ చంద్రబోసా? భగత్ సింగా?" అని జయప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ వ్యాఖ్యతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆపై రానా బైక్ పై వస్తున్న దృశ్యాలు 'నెలవంక తొంగి చూసింది... చలిగాలి మేను సోకింది' అన్న పాత పాట, కాజల్ తో రొమాన్స్ క్లిప్ ఉన్నాయి.
ఓ భారీ భవంతి ఏరియల్ వ్యూ, కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద భారీ జన సందోహం వ్యూ, ఓ పాత్ర (నవదీప్) తన తుపాకితో పోలీసు అధికారి (అజయ్)కి గన్ పెట్టే దృశ్యాలు కనిపిస్తాయి. "హే... ఈ కటౌట్ కి గజమాల పడే టైమొచ్చేసింది" అని మరో పాత్ర (అశుతోష్ రాణా) చెప్పడం ఉంది.
ఆపై ఉరికంభం ముందు తెల్లచొక్కా, తెల్ల లుంగీ కట్టుకుని సిగరెట్ తాగుతూ కనిపించే రానా, "లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం సీటు నా ముడ్డి కింద ఉండాలి" అనే డైలాగుంది. తదుపరి ఓ ఫైట్ సీన్ ఉంది. "నేను సీఎంనని మరచిపోకు" అని తనికెళ్ల భరణి అంటే, "వందమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్‌లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం" అన్న హెచ్చరిక, టైటిల్ సాంగ్ బిట్ ఉన్నాయి. ట్రయిలర్ చివర్లో "మామా వెనకటికో సామెత ఉండేది. పాముకు పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి" అన్న రానా డైలాగ్ ఉంది. ఈ ట్రయిలర్ నిన్న విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది.