: లోకల్ ట్రైన్ లో సీటివ్వలేదని తోటి ప్రయాణికులపై కారం పొడి చల్లి పారిపోయాడు!
కూర్చునేందుకు తనకు సీటు ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులపై కారం పొడి చల్లి పారిపోయిన సంఘటన ముంబయి లోకల్ ట్రైన్ లో ఈ రోజు జరిగింది. స్థానిక షాహాద్ స్టేషన్ లో ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ ఎక్కాడు. కిటకిటలాడుతున్న ఆ ట్రైన్ లో కూర్చునేందుకు సీటు ఇవ్వమని తోటి ప్రయాణికులను అడిగాడు. అందుకు వారు అంగీకరించలేదు. దీంతో, సదరు వ్యక్తి మరో స్టేషన్ లో ట్రైన్ దిగిపోతూ, తన వద్ద ఉన్న కారంపొడిని వారిపై చల్లి పారిపోయాడు. ఈ సంఘటనలో ఏడుగురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. కాగా, ఈ సంఘటనపై ప్రత్యక్షసాక్షి దీపక్ అనే ప్రయాణికుడు కల్యాణ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.