: ప్రియుడి కోసం భర్త, అత్తలను అంతమొందించబోయిన కోడలు... అడ్డంగా బుక్కయిన వైనం!
మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయి. వ్యక్తిగత స్వార్థం, క్షణిక సుఖం, క్షణికావేశంతో ఒకర్ని ఒకరు అంతమొందించుకుంటూ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...పశ్చిమ ఢిల్లీలో అబ్దుల్ (27) అనే వ్యక్తి జిమ్ నిర్వహిస్తున్నాడు. ఆ జిమ్ కు వ్యాయామం నిమిత్తం అదే ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల గృహిణి వస్తుండేది. ఈ క్రమంలో అబ్దుల్ తో ఆమెకు పరిచయం పెరిగి సాన్నిహిత్యానికి, అటునుంచి అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం నెమ్మదిగా ఆమె అత్త నారాయణి, భర్త అనూప్ కి తెలిసింది. దీంతో వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆమెను కట్టడి చేశారు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను అంతమొందించేందుకు ప్రియుడు అబ్దుల్ తో కలిసి ఆమె ప్లాన్ చేసింది.
ప్లాన్ ప్రకారం ఆమె భోజనంలో నిద్రమాత్రలు కలిపింది. వారికి అనుమానం రాకుండా ఆమె కూడా వారితో పాటు నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని తీసుకుంది. దీంతో అంతా మత్తులోకి జారిపోయారు. ఈ సమయంలో ఆమె ప్రియుడు అబ్దుల్ వచ్చి, వారిద్దరిపై దాడి చేశాడు. వారిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని భావించి, వెళ్లిపోయాడు. కాసేపటికే వారి బంధువులు వచ్చి వారిని చూసి ఆసుపత్రిలో చేర్చారు. దీంతో అంతా చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్త, అత్తపై దాడి చేసిన వారు కోడలిని ఎందుకు వదిలేశారు? అన్న దిశలో దర్యాప్తు చేశారు. దీంతో ఆమె అక్రమ సంబంధం వెలుగు చూసింది. దీంతో అబ్దుల్ ను పట్టుకుని తమదైన శైలిలో విచారించగా వాస్తవం కక్కేశాడు. దీంతో అతనిని జైలుకు పంపిన పోలీసులు, మెలకువరాగానే ఆమెను జైలుకు పంపేందుకు ఎదురుచూస్తున్నారు.