: చైనాతో చెడుతోందా?: బిజినెస్, వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేసిన పాకిస్థాన్
తమ దేశానికి అత్యంత సన్నిహితంగా ఉన్న చైనాతో పాకిస్థాన్ సంబంధాలు దెబ్బతింటున్నాయా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. చైనా వాసులకు ఇచ్చే వ్యాపార, పని వీసాల నిబంధనలను కఠినతరం చేస్తూ పాక్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త వీసా నిబంధనలను పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసింది. బెలూచిస్థాన్ లో ఇద్దరు చైనా జాతీయుల హత్య జరగడం, ఆపై చైనా మండిపడిన నేపథ్యంలో, రెండు వారాల తరువాత, ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
చైనీయులకు ఇచ్చే దీర్ఘకాల వీసాలను సైతం గణనీయంగా తగ్గించాలని పాక్ నిశ్చయించింది. మరిన్ని భద్రతా పరమైన అంశాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుమతి లేఖలు, చైనా అధికారుల నుంచి తీసుకు వచ్చే అనుమతుల విషయంలో నిబంధనలను పాక్ ప్రభుత్వం కఠినం చేసిందని 'డాన్' పత్రిక పేర్కొంది. ఇప్పటికే పాకిస్థాన్ లో ఉన్న చైనా వాసుల వీసాల పొడిగింపు విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇకపై చైనీయుల బిజినెస్ వీసాల జారీ ప్రక్రియను ఇస్లామాబాద్ లో మాత్రమే పూర్తి చేయాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.