: 'అత్యాచారం చేసిన వాళ్లని అరెస్టు చేయాలంటే నువ్వు నా గదికి రా' అన్న ఎస్సై ఆటకట్టించిన మహిళ!
'అత్యాచారం చేసిన వారు మళ్లీ వేధిస్తున్నారు... వారిని అరెస్టు చేయండి' అంటూ తన కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్లిన మహిళను... ఒంటరిగా తన గదికి వచ్చి కోరిక తీర్చాలని కోరిన ఖాకీకి భాధిత మహిళ బుద్ధి చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... రామ్ పూర్ కి చెందిన మహిళ (37) గత ఫిబ్రవరి 12న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అమీర్ అహ్మద్ (55), సత్తార్ అహ్మద్ (45) అనే వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆమె నేరుగా మేజిస్ట్రేట్ ను ఆశ్రయించింది. ఆయన ఆదేశాల మేరకు పలు అభియోగాలు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.
కేసులు నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దర్జాగా తిరుగుతూ వారు ఆమెను మరింతగా వేధించడం మొదలెట్టారు. దీంతో ఆమె దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై జై ప్రకాశ్ సింగ్ ఆమెతో... ‘వారిని అరెస్టు చేయాలంటే ముందు నువ్వు నా కోరిక తీర్చు... నాకు ఫోన్ చేసి, నా గదికి ఒంటరిగా రా...నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే వారిని అరెస్టు చేస్తాను' అంటూ ఆఫర్ ఇచ్చాడు. దీంతో అతని మాటలన్నిటినీ రికార్డు చేసిన ఆమె నేరుగా వాటిని సీడీ రూపంలో తయారు చేసి ఎస్పీకి అందజేసింది. దీంతో అతనిని విధుల నుంచి తప్పించి, దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు.