: ఇరాన్ డ్రోన్ ను కూల్చివేసిన పాకిస్థాన్!
ఇరాన్ కు చెందిన ఓ గూఢచార డ్రోన్ ను పాకిస్థాన్ కూల్చి వేసింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ లో డ్రోన్ ఎగురుతున్న సమయంలో పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్ దాన్ని కూల్చి వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన జేఎఫ్-17 థండర్ ఫైటర్ తో డ్రోన్ ను నాశనం చేశామని పాక్ అధికారులు తెలిపారు. అయితే, ఈ డ్రోన్ ను ఎప్పుడు కూల్చారనే విషయంలో స్పష్టత లేనప్పటికీ... డ్రోన్ శకలాలను మాత్రం సోమవారంనాడు గుర్తించారు. ఇరాన్ తో పాకిస్థాన్ కు చాలా పొడవైన సరిహద్దు ఉంది. తమ సరిహద్దుకు అవతలివైపు ఉన్న పాక్ భూభాగంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటూ గత కొంతకాలంగా ఇరాన్ ఆరోపిస్తోంది. మిలిటెంట్లను కంట్రోల్ చేయకపోతే... వారిపై తామే దాడి చేయాల్సి ఉంటుందని పాక్ ను ఇరాన్ హెచ్చరించింది కూడా.