: లండన్ టూ న్యూయార్క్... 3,400 మైళ్ల దూరం రెండున్నర గంటల్లో ప్రయాణం!
అవును... మీరు చదివింది నిజమే. లండన్ నుంచి న్యూయార్క్ కు మధ్య ఉన్న 3,400 మైళ్ల దూరాన్ని రెండున్నర గంటల్లో చేరుకునేలా సూపర్ సానిక్ కమర్షియల్ విమాన సేవలను అందించనున్నామని ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ బూమ్ వెల్లడించింది. 'లార్డ్ ఆఫ్ రింగ్స్' చిత్రాన్ని చూసేందుకు పట్టే సమయంలోనే ప్రయాణికులు లండన్ నుంచి న్యూయార్క్ చేరుకోవచ్చని, పారిస్ లో జరుగుతున్న ఎయిర్ షోలో బూమ్ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్లేక్ స్కాల్ వెల్లడించారు.
మరో ఆరేళ్లలో ఈ కల నిజమవుతుందని, పసిఫిక్ మహాసముద్రాన్ని ప్రయాణికులతో కలసి 2.5 గంటల్లో దాటేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టోక్యోకు 5.5 గంటల్లో (ప్రస్తుతం 11 గంటలు), లాస్ ఏంజిల్స్ నుంచి సిడ్నీకి ఏడు గంటల్లోపు (ప్రస్తుతం 15 గంటలు) ప్రయాణించే హై స్పీడ్ విమాన సేవలనూ అందిస్తామని తెలిపారు. ఇప్పటికే సూపర్ సానిక్ విమానాల సేవలను కోరుతూ, ఐదు ఎయిర్ లైన్స్ సంస్థలు 70కి పైగా ఆర్డర్లను ఇచ్చాయని ఆయన అన్నారు.
కాగా, ఈ వేగవంతమైన ప్రయాణ ఆలోచన బూమ్ కు అంత లాభదాయకం కాదని విమానరంగ నిపుణులు భావిస్తున్నారు. 2003లోనే యూరోపియన్ విమానసంస్థ కాంకార్డ్, పసిఫిక్ మహాసముద్రంపై సూపర్ సానిక్ వేగంతో విమానాన్ని నడిపినప్పటికీ, సేవలను కొనసాగించడంలో మాత్రం విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఈ ప్రయాణానికి 20 వేల డాలర్లను టికెట్ గా నిర్ణయించగా, ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపించలేదని ఇండస్ట్రీ అనలిస్ట్ రాబర్ట్ మన్ వ్యాఖ్యానించారు. ఈ విమానాలకు కావాల్సిన సాంకేతికత, సమయానుకూల ప్రయాణం, ఆకాశయాన నిబంధనలు తదితరాలు బూమ్ కు అడ్డంకులు కావచ్చని అంచనా వేశారు.