: యోగా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది: అనుష్క
యోగా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి తెలిపింది. అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె యోగా తన జీవితంలో తెచ్చిన మార్పులను సోషల్ మీడియా ద్వారా వివరించింది. ఈ సందర్భంగా తన ఫోటోను పోస్టు చేసిన ఆమె, దానిపై తన జీవితంలో యోగా తెచ్చిన మార్పును గుర్తుచేసుకుంటూ, ‘యోగా టీచర్ గా మారాలన్నది నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. డాక్టర్లు, ఇంజినీర్లు గల ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి అందరికీ విభిన్నంగా యోగా ఎంచుకోవడం సాహసోపేతమే. అయితే నా జీవితంలో చోటుచేసుకున్న పెను మార్పులకు యోగాయే కారణం. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే’ అంటూ ధ్యానం చేస్తున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, ‘దేవసేన’గా ‘బాహుబలి’ విజయాన్ని ఆస్వాదిస్తున్న అనుష్క ప్రస్తుతం ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది.