: అట్టహాసంగా జరిగే వేడుకల నడుమ అమల్లోకి 'ఒక దేశం ఒక పన్ను': జైట్లీ
దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ బిల్లు, వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైన ఈ క్షణాలను గుర్తుండిపోయేలా చేస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈనెల 30 అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జీఎస్‌టీ బిల్లును ఆవిష్కరిస్తామని, ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యే వేడుకలకు ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్, పలువురు కేంద్ర మంత్రులు, జీఎస్‌టీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని ఆయన అన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులను కూడా ఆహ్వానించామని తెలిపారు. జీఎస్‌టీ అమలు, ఆవశ్యకతపై చిత్రీకరించిన రెండు షార్ట్ ఫిలింలను ప్రసారం చేస్తామని పేర్కొన్న జైట్లీ, అతిధులందరికీ విందు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఆపై జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని అన్నారు.