: పోలికలు తెచ్చిన ముప్పు: చేయని తప్పుకి 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు!
తాను చేయని తప్పుకి ఓ వ్యక్తి 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇన్నేళ్ల తరువాత ఆయన ఆ తప్పు చేయలేదని తెలుసుకున్న కోర్టు ఆయనను జైలు నుంచి విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే, కాన్సస్కి చెందిన రికీ అమోస్ అనే వ్యక్తి ఒక మహిళను ఓ ప్రాంతంలో ఆయుధాలతో బెదిరించాడు. ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. అనుమానితుల ఫొటోలను చూపించారు. అందులో రికీ ఆమోస్ ఫొటోను చూసిన స్థానికులు అతనే ఈ దోపిడీ చేశాడని తెలిపారు.
దీంతో గాలింపు మొదలుపెట్టిన పోలీసులు రికీ అమోస్ను అరెస్టు చేయకుండా అచ్చం అలాగే ఉన్న మిస్సోరికి చెందిన రిచార్డ్ ఆంథోని జోన్స్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా ప్రత్యక్ష సాక్షులు కూడా అతడే రికీ అమోస్ అనుకుని పొరపడ్డారు. అతడే ఈ దోపిడీ చేశాడని తెలిపారు. దీంతో ఏ పాపం తెలియని అతడికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఇటీవల జోన్స్ కోర్టులో మరోసారి అభ్యర్థన పెట్టుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు. జోన్స్లాగే రికీ అనే మరో వ్యక్తి ఉన్నాడని తెలుసుకుని అతడు విడుదలయ్యేలా చేశారు.