: ఈ విషయంలో చైనా, పాకిస్థాన్ లు మనకన్నా వెనకే ఉన్నాయి!
ఈ ప్రపంచంలో భారతీయుడు లేని చోటు అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. అది చైనా అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, గల్ఫ్ అయినా భారతీయులు ఉండాల్సిందే. ముఖ్యంగా మన తెలుగువారు ఉండని దేశం కూడా ఉండదు. ఐటీ అండతో ప్రపంచంలోని నలుమూలలకూ మనవాళ్లు విస్తరించారు. విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య ప్రతి యేటా పెరుగుతోంది.
తాజాగా ప్రపంచంలోని ఏ దేశానికి ఎక్కువగా విదేశాల నుంచి ఎక్కువ డబ్బు పంపిస్తున్నారనే విషయమై 'యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రకల్చర్ డెవలప్ మెంట్' అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది. ఈ జాబితాలో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ప్రవాస భారతీయులు ఇతర దేశస్తులకన్నా ఎక్కువ సంపాదనను తమ మాతృ భూమికి పంపుతున్నారు. 62.7 బిలియన్ డాలర్ల (దాదాపు 4 లక్షల కోట్లు) మొత్తాన్ని విదేశాల నుంచి మనవాళ్లు భారత్ కు పంపుతున్నారు. ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో చైనా (61 బిలియన్ డాలర్లు) నిలిచింది. మూడో స్థానంలో ఫిలిప్పీన్స్ (29.9 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో మెక్సికో (28.5 బిలియన్ డాలర్లు) నిలవగా పాకిస్థాన్ ఐదో స్థానంలో (19.8 బిలియన్ డాలర్లు) నిలిచింది.