: 'స్పీకర్ ని అంతమాట అంటావా?' అంటూ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం పీకేశారు!
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ ను పట్టుకుని అంత మాట అంటావా? అంటూ ఓ సెక్యూరిటీ గార్డుని ఉద్యోగంలోంచి తొలగించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... గాంధీనగర్ లోని సివిల్ హాస్పిటల్ కి కంటి చికిత్స నిమిత్తం గుజరాత్ బీజేపీ సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ రాంలాల్ వోరా జూన్ 13న తన కుమారుడితో కలిసి వెళ్లారు. ఈ సమయంలో ఆయన కారును ఆసుపత్రి గేటు ఎదురుగా ఆపారు. దీంతో అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ గార్డు ‘ఓ కాకా! కారు ఇక్కడ ఆపకూడదు. పక్కకు వెళ్లి ఆపు’ అంటూ ఆయనని అడ్డుకున్నాడు. తనకు వంగి సలాము చేయాల్సిన సెక్యూరిటీ గార్డు కాకా అనడం ఆయనకు అస్సలు నచ్చలేదు.
దీంతో ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, అతనిని విధుల నుంచి తప్పించారు. అంతటితో ఆగని ఆయన సెక్యూరిటీ గార్డుతో క్షమాపణ లేఖ కూడా రాయించుకున్నారు. దీనిపై హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇస్తూ, ‘వోరా పెద్ద మనిషి. అంతే కాకుండా అసెంబ్లీ స్పీకర్. అంత పెద్దాయనతో మార్యదపూర్వకంగా ఉండాలి. ఏదో పక్కింటాయనను లేదా బాగా పరిచయమున్న వ్యక్తిని పిలిచినట్లు కాకా అనడం భావ్యం కాదు. అందుకే ఆయన్ని తొలగించాం.’ అని హాస్పిటల్ సూపరింటెండెంట్ బిపిన్ నాయక్ తెలిపారు.
అయితే, ఈ ఉదంతంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షమాపణ లేఖ రాయించుకున్నాక చర్యలేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 'బుగ్గ కార్లు వాడొద్దు, సాధారణ పౌరుల్లా ఉండండి' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ పక్క పిలుపునిస్తూ, వీఐపీ కల్చర్ ను రూపుమాపాలని ప్రయత్నిస్తుంటే... అదే పార్టీకి చెందిన సీనియర్ నేత సెక్యూరిటీ గార్డుపై అధికారం ప్రదర్శించడం ఏంటని నిలదీస్తున్నారు. చిన్న విషయానికి ఉద్యోగం తీయించడం భావ్యమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.