: రణరంగంగా మారిన గూర్ఖాల్యాండ్... ప్రాణత్యాగానికైనా సిద్ధం కానీ బెంగాల్ ను విడదీయనన్న మమతా బెనర్జీ!


గూర్ఖాల్యాండ్‌ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం మరింత వేడెక్కుతోంది. తొలుత ప్రశాంతంగా ప్రారంభమైన ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారుతోంది. గత రెండు రోజులుగా పశ్చిమ బెంగాల్‌ లోని డార్జిలింగ్‌ పర్వత ప్రాంతాలు హింసాత్మక ఘటనలతో హోరెత్తుతున్నాయి. పోలీసులు, భద్రతా బలగాలపై గూర్ఖాల్యాండ్ ఆందోళనకారులు రాళ్లు, పెట్రోలు బాంబులతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో డార్జిలింగ్‌ లోని సింగమారిలో పోలీసులు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతిచెందారు.

జూన్‌ 8న ఆందోళనలు మొదలుకాగా, పది రోజులకు హింస చెలరేగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ఘర్షణలు ఉపందుకున్నాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ (ఐఆర్‌బీ)కి చెందిన అధికారి కిరణ్‌ తమంగ్‌ సహా మొత్తం 19 మంది ఆందోళనకారుల దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు.

 దీనిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఈ ఘర్షణలు ఒక్కరోజులో చోటుచేసుకున్నవి కాదని అన్నారు. పక్కా ప్లానింగ్ తో చాలా రోజుల క్రితం పన్నిన కుట్రలా అర్థమవుతోందని చెప్పారు. కేవలం ఒక్క రోజులో ఇన్ని బాంబులు, ఆయుధాలను ఆందోళనకారులు సమకూర్చుకోలేరని ఆమె స్పష్టం చేశారు. గూర్ఖాల్యాండ్ ఆందోళనల వెనుక ఈశాన్య ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలు, విదేశీ శక్తులు ఉన్నట్టు అవగతమవుతోందని ఆమె చెప్పారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాను కానీ, బెంగాల్ ను మాత్రం విడదీయనని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News