: ఫ్యాన్స్ నాతో సెల్ఫీలు దిగారు.. దాంతో విమానం మిస్ అయ్యాను!: హీరోయిన్ తాప్సీ
ఎయిర్‌పోర్టులో తన అభిమానులు తనను కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఉండడంతో విమానాన్ని మిస్ అయిపోయానని హీరోయిన్ తాప్సీ తెలిపింది. షూటింగుల్లో బిజీబిజీగా ఉంటున్న ఈ అమ్మడుకి ప్రస్తుతం కాస్త విరామం దొరికింది. దీంతో ఆమె తన కుటుంబంతో గడపడానికి ముంబై వెళ్లాలనుకుని, ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి వెళ్లింది. ఈ సందర్భంగానే తాను విమానం మిస్ అయ్యానని తాప్సీ చెప్పింది. మామూలుగా తాను విమానాశ్రయాలు, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో అభిమానులతో కలిసి ఫొటోలు దిగబోనని ఆమె తెలిపింది. ఎందుకంటే తాను ఎటువంటి భద్రత లేకుండానే వెళతానని చెప్పింది.
ఆయా ప్రదేశాల్లో అభిమానులు ఒక్కసారిగా తన దగ్గరికి వస్తే వారిని అదుపుచేయడం తన వల్లకాదని తాప్సీ తెలిపింది. కాకపోతే కొంతమంది అభిమానుల ప్రేమ మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తోందని చెప్పింది. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోకి తాను రాగానే కొంతమంది కాలేజీ విద్యార్థులు తనను చూసి దగ్గరికి వచ్చి, తాను నటించిన సినిమాల గురించి తనతో మాట్లాడారని చెప్పింది. తాను పోషించిన పాత్రల గురించి తనకు వాళ్లు చెప్పిన తీరు తనను ఆకట్టుకుందని తెలిపింది. ఆ విద్యార్థులంతా తనతో సరదాగా సెల్ఫీలు దిగారని చెప్పింది. దీంతో తాను ఎక్కాల్సిన విమానం వెళ్లిపోయిందని తెలిపింది.