: చంద్రబాబుతో భేటీ అయిన అనంతపురం జిల్లా నేతలు!
అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి అనంత నేతలతో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమ, జవహర్ తదితరులు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ వివాదం, జిల్లా నేతల మధ్య సమన్వయం, విశాఖ విమానాశ్రయంలో జేసీ వీరంగం, దీపక్ రెడ్డి భూ కుంభకోణంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
జడ్పీ ఛైర్మన్ వివాదం వివరాల్లోకి వస్తే, పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ రామగిరి జడ్పీటీసీగా గెలిచి, జడ్పీ ఛైర్మన్ అయ్యారు. రాయదుర్గం నుంచి గెలిచిన పూల నాగరాజు కూడా అప్పట్లో ఈ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే, వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి, ఇద్దరూ కూడా చెరో రెండున్నరేళ్లు ఛైర్మన్ పదవిని నిర్వహించేలా ఒప్పందం చేశారు. అయితే, రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత కూడా ఛైర్మన్ పదవిని వదిలేందుకు చమన్ ససేమిరా అంటున్నారు. దీంతో, ఈ పంచాయతీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లింది.