: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రోజే.. ప్రపంచ దేశాల ముందు పాక్‌ను కడిగి పారేయనున్న భారత్!
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో ఆదివారం భారత్-పాక్‌లు తలపడనున్నాయి. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఉతికి ఆరేసిన టీమిండియా ఫైనల్ పోరులో పాక్ భరతం పట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అదే రోజు ఉగ్రవాదానికి వెల్లువెత్తుతున్న నిధులకు అడ్డుకట్ట వేయడంపై చర్చించేందుకు స్పెయిన్‌లోని వెలెన్సియాలో 198 దేశాలు సమావేశం కానున్నాయి. ఇందులో ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. భారత్ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ కర్నల్ సింగ్‌తో కూడిన బృందం పాల్గొంటోంది.
ఉగ్రవాదులకు పాక్ నిధుల సాయంపై భారత్ పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. పాక్ గడ్డపై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలైన జమాత్-ఉద్-దవా, లష్కరే తాయిబా, జైష్-ఇ-మహమ్మద్ తదితర సంస్థలకు పాక్ నుంచి అందుతున్న నిధుల గురించి ప్రస్తావించనుంది.
జూన్ 18 నుంచి 23 వరకు జరగనున్న ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ప్లీనరీలో జమాత్-ఉద్-దవా (జేయూడీ) గురించి అంతర్జాతీయ సమాజానికి భారత్ ఫిర్యాదు చేయనుంది. జేయూడీ తన కార్యకలాపాలను యెమన్, సోమాలియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోందని వివరించనుంది. ఉగ్రవాదంపై పాక్ తీసుకుంటున్న చర్యలు కేవలం పేపర్‌కే పరిమితమవుతున్న తీరును అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టనుంది.
ముఖ్యంగా జేయూడీ/ ఎల్‌ఈటీ, దాని చీఫ్ హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఎఫ్ఏటీఎఫ్‌లో భారత్ ఫిర్యాదు చేయనుంది. కాగా, ఉగ్ర సంస్థలకు నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంలో విఫలమైనందుకు గతంలో జరిగిన మీటింగ్‌లో పాక్ తీరుపై ఎఫ్‌ఏటీఎఫ్ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాకిస్థాన్ ఇప్పటికైనా ఈ విషయంలో చర్యలు తీసుకోకుంటే టెర్రరిజంపై చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేస్తున్నందుకు అతి పెద్ద డిపాల్టర్‌గా మిగిలిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.