: జీవితాంతం జైల్లో ఉండాలనే భయంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారు: రోజా
రాష్ట్రంలో జరిగిన భూ కబ్జాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. విశాఖలో లక్ష ఎకరాల భూమిని కబ్జా చేశారని... దేశంలోనే అతి పెద్ద భూ కబ్జా ఇదేనని ఆమె అన్నారు. ఈ భూ కబ్జాకు సంబంధించి టీడీపీ మంత్రులు, అధికార పార్టీ మిత్రపక్షం బీజేపీ, మీడియా కోరుతున్నా సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు మొగ్గు చూపడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిగితే తాము చేసిన భూ దందాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. తెలంగాణలో చోటు చేసుకున్న భూ దందాలపై సీబీఐ విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్న టీడీపీ... ఏపీలో జరుగుతున్న భూ దందాలపై సీబీఐ చేత ఎందుకు విచారణ జరిపించడం లేదని మండిపడ్డారు. ఒకసారి దర్యాప్తు జరిగితే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు.