: నరేంద్ర మోదీ రాక కోసం వేచి చూస్తున్న డొనాల్డ్ ట్రంప్: వైట్ హౌస్


ఈనెల 26న భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా వేచి చూస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. భారత్ తో ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా పలు కీలకాంశాలపై వీరు చర్చలు సాగించనున్నారని ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ పేర్కొన్నారు. రెండు దేశాల సంయుక్త ప్రయోజనాలను కాపాడుకునే లక్ష్యంతో చర్చలు సాగుతాయని, ఉగ్రవాదంపై పోరాటం, ఆర్థిక వృద్ధికి సహకారం, సంస్కరణల అమలు, భద్రతా పరమైన అంశాల్లో మరింత సాయం, ఇండో - పసిఫిక్ రీజియన్ లో సహకారం వంటి అంశాలపై భారత ప్రధానితో అధ్యక్షుడు మాట్లాడనున్నారని తెలిపారు. రెండు దేశాల్లోని 160 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ధిని పొందేలా చూడటమే ట్రంప్ ఉద్దేశమని పేర్కొన్నారు.

కాగా, గత వారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, ట్రంప్ తో సమావేశమైన వేళ, భారత ఐటీ కార్మికులు వినియోగించుకునే హెచ్-1బీ వీసాల విషయంలో నెలకొన్న అనుమానాలపై ప్రధాని చర్చిస్తారని పేర్కొన్న సంగతి తెలిసిందే. యూఎస్ అందించే వీసాల వల్ల 2001 నుంచి 2015 వరకూ సుమారు 18 లక్షల మంది అమెరికాలోకి వెళ్లగా, అందులో 50.5 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News