: చరిత్రలో తొలిసారి.. తలాక్ చెప్పినందుకు రూ.2 లక్షల జరిమానా!
తలాక్ చెప్పిన వ్యక్తికి రూ.2 లక్షలు జరిమానా విధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది. తలాక్ చెప్పిన వ్యక్తికి జరిమానా విధించడం ఇదే తొలిసారి. జిల్లాలోని రాయ్‌సరి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల మహిళను పది రోజుల క్రితం వివాహమాడాడు. ఇటీవల చిన్న విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు తుర్క్ పంచాయత్‌ను ఆశ్రయించారు.
ఖలీల్-ఉల్-ఉలూమ్ మదర్సాలో నిర్వహించిన తుర్క్ పంచాయత్‌కు 52 గ్రామాలకు చెందిన సభ్యులు హాజరై కనీవిని ఎరుగని తీర్పు చెప్పారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు రూ.2 లక్షల జరిమానా విధించారు. దానిని వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అలాగే భరణం కింద బాధిత మహిళకు రూ.60 వేలు చెల్లించాలని, వివాహ సమయంలో తీసుకున్న కట్నాన్ని తిరిగి ఇచ్చేయాలని పంచాయతీ ఆదేశించింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం విమెన్స్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షైష్టా అంబర్ మాట్లాడుతూ పంచాయతీ సభ్యుల నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇటువంటి నిర్ణయాలతో ట్రిపుల్ తలాక్ జాడ్యానికి చెక్ పెట్టవచ్చని అన్నారు.