: నిజంలో ఉన్న శక్తిని మీడియా వదిలేసింది: రాహుల్ గాంధీ
నిజంలో ఉన్న శక్తిని మీడియా వదిలేసిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు బెంగుళూరులో జరిగిన నేషనల్ హెరాల్డ్ పత్రిక స్మారక ప్రచురణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... మీడియా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. సమాజంలో నిజం కోసం నిలబడే వ్యక్తుల్ని కొందరు పక్కకు తోసేస్తున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో ఇటీవల జరిగిన రైతులపై కాల్పుల ఘటన నేపథ్యంలో తాను అక్కడకు వెళితే, తనను అడ్డుకున్నారని, అయితే, ఎందుకు తనను అడ్డుకున్నారో ఎవరూ చెప్పలేకపోయారని వ్యాఖ్యానించారు. కేంద్ర సర్కారు దేశ ప్రజల గొంతు నొక్కేస్తోందని ఆరోపించారు.